EPDC
EPDC Logo

Environment Protection Development Council

పర్యావరణ పరిరక్షణ సత్యనిష్టతో కూడిన కృషి: వర్ల రామయ్య

మహాత్మ జ్యోతిరావు పూలేని ఆదర్శంగా తీసుకోవాలి : బీసీ కుల సంఘాల ఐక్యవేదిక అంబర్పేట నియోజకవర్గం అధ్యక్షుడు పెంటం వెంకట్, కార్యదర్శి ఈశ్వర్.

Image

హైదరాబాద్, ఏప్రిల్ 11,దక్షిణాది న్యూస్ : మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా అంబర్‌పేటలో పలువురు ఘనంగా నివాళులర్పించారు. బీసీ కుల సంఘాల ఐక్యవేదిక అంబర్‌పేట నియోజకవర్గం అధ్యక్షుడు పెంటం వెంకట్ మరియు కార్యదర్శి ఈశ్వర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ మహాత్మా ఫూలే నిజమైన మహాత్ముడని కొనియాడారు.19వ శతాబ్దంలో క్రియాశీలక సామాజిక ఆలోచనాపరులుగా మహాత్మ జ్యోతిరావు పూలే సమాజంలో అణగారిన వర్గాలైన గ్రామస్తులు, రైతులు, కార్మికులు మరియు మహిళలకు మానవ హక్కులు కల్పించడం కోసం జీవితాంతం పోరాడారని వారు గుర్తు చేశారు. పశ్చిమ దేశాలలోని ప్రజాస్వామ్య విలువలు, సంస్కృతి మరియు జీవన విధానాన్ని అధ్యయనం చేసిన పూలే, థామస్ ఫైన్ రాసిన 'రైట్స్ ఆఫ్ మాన్' పుస్తకం ద్వారా తీవ్రంగా ప్రభావితమయ్యారని వారు తెలిపారు. సమాజంలో పేరుకుపోయిన మూఢ విశ్వాసాలకు, అజ్ఞానానికి కారణమైన బ్రాహ్మణాధిపత్య కుట్రలను పెకిలించి వేయడానికి విద్యనే సరైన మార్గమని ఆయన నమ్మారని వారు వివరించారు. విద్య ద్వారానే సమాజాన్ని మార్చాలన్న గొప్ప ఆశయంతో అణగారిన వర్గాల జీవితాల్లో అఖండ అక్షర జ్యోతులు వెలిగించి చైతన్య పరిచారని, విద్య కోసం ఆధిపత్య వర్గాలతో ఆయన ఆజన్మాంతం అక్షర యుద్ధం చేశారని పెంటం వెంకట్ మరియు ఈశ్వర్ పేర్కొన్నారు. వివక్షత నిండిన ఆ రోజుల్లోనే పేద ప్రజల కోసం పాఠశాలలు నిర్మించి వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి కృషి చేసిన మహాత్మ జ్యోతిరావు పూలేను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని వారు సూచించారు. మొట్టమొదటిసారిగా మహిళలను విద్యావంతులను చేయాలనే సంకల్పంతో మొదటగా మాత సావిత్రిబాయి పూలేకు చదువు నేర్పి, తన ద్వారా మహిళల కోసం ఒక పాఠశాలను నిర్మించి, వితంతు మహిళలను చేరదీసి వారికి ఆదర్శవంతమైన మార్గాలను చూపించిన మహాత్మ జ్యోతిరావు పూలే ప్రతి ఒక్కరి హృదయాలలో నిలిచిపోవాలని వారు ఆకాంక్షించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలు ఐక్యతతో అసమానతలు లేని భారతదేశం కోసం కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు బీసీ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.