
ఏఐకేఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.... జెండా ఆవిష్కరణ. విజయనగరం, ఏప్రిల్ 11(దక్షిణాది న్యూస్) : అఖిల భారత రైతు సంఘం (ఏఐకేఎస్) 30వ జాతీయ మహాసభలు ఈ నెల 15, 16, 17 తేదీల్లో తమిళనాడు రాష్ట్రం నాగపట్నంలో జరగనున్నాయని సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు తెలిపారు. శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ప్రజాసంఘాల కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో జండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...1936 ఏప్రిల్ 11వ తేదీన లక్నోలో జరిగిన ప్రథమ మహాసభను గుర్తు చేశారు. ఆ మహాసభలో స్వామి సహజానంద సరస్వతి అధ్యక్షుడిగా, ఎన్జీ రంగా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారని ఆయన చెప్పారు. ఆనాటి ప్రధాన కర్తవ్యమైన బ్రిటిష్ పాలనను అంతమొందించడం మరియు స్వతంత్రం సాధించడమే తొలి ధ్యేయంగా ఉద్యమాలు పట్టణ ప్రాంతాల్లో, మేధావులతో జరుగుతుండగా, అఖిల భారత రైతు సంఘం ఏర్పడటంతో ఉద్యమం మరో కీలక మలుపు తిరిగిందని అప్పలనాయుడు అన్నారు. ఆ సమయంలో సంఘం మూడు ప్రధాన కర్తవ్యాలను నిర్దేశించుకుందని ఆయన తెలిపారు. అవి: భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడం, జమీందారీ విధానాన్ని రద్దు చేయడం, ఆర్థిక సాంఘిక దోపిడీ, పీడనకు వ్యతిరేకంగా గ్రామీణ ప్రాంతంలో పెద్ద ఎత్తున చైతన్యం నింపి రైతులను ఉద్యమంలోకి తీసుకురావడం. జమీందారీ విధానాన్ని రద్దు చేయాలని, దున్నేవానికే భూములు పంచాలని, అదనపు పన్నులను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రైతాంగాన్ని సమీకరించి రైతు సంఘం ఉద్యమంలో కీలక పాత్ర పోషించిందని ఆయన గుర్తు చేశారు. ఆ పోరాట ఫలితంగానే కొన్ని రైతు హక్కులు సాధించుకోవడంతో పాటు భాక్రానంగల్, నాగార్జునసాగర్ వంటి సాగునీటి ప్రాజెక్టులు సాకారమయ్యాయని ఆయన అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రైతులకు కావాల్సిన హక్కులను చట్టరూపంలో సాధించుకోవడం ఆ ఉద్యమ స్ఫూర్తి ఫలితమేనని ఆయన అభిప్రాయపడ్డారు. 1990వ దశకంలో వచ్చిన ఆర్థిక, వ్యవసాయ సరళీకరణ విధానాలతో స్వతంత్ర భారతంలో కార్పొరేట్ సంస్థలకు పాలకులు బాటలు వేశారని, నేటి బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో చట్టాలను మారుస్తూ అదానీ, అంబానీ వంటి బహుళ జాతి సంస్థలకు ఊడిగం చేయడానికి కరోనా కష్టకాలంలో రైతు వ్యతిరేక మూడు నల్ల చట్టాలను తీసుకువచ్చిందని అప్పలనాయుడు విమర్శించారు. ఏఐకేఎస్‌తో పాటు 540 సంఘాలను ఏకతాటిపై నడిపి 13 నెలల పాటు ఢిల్లీ నడిబొడ్డున లక్షలాది మంది రైతాంగం సాగించిన మహోద్యమాన్ని ప్రపంచవ్యాప్తంగా గుర్తించిందని ఆయన అన్నారు. ఆ సమయంలో హేళన చేసిన నరేంద్ర మోడీ ఉద్యమ ఉధృతికి తలొగ్గి రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని హామీ ఇచ్చారని, కానీ వాటిని పూర్తిగా రద్దు చేయలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నేడు రైతులకు ఎంతో ఉపయోగకరమైన సహకార వ్యవస్థను, మార్కెటింగ్ వ్యవస్థను, భారీ ఎఫ్‌సీఐ గిడ్డంగులను అదానీ, అంబానీలకు అప్పగించడానికి సిద్ధమవుతున్న తరుణంలోనే నాగపట్నంలో జరగనున్న జాతీయ మహాసభల్లో వ్యవసాయ విధానంలో వస్తున్న మార్పులు, రైతు వ్యతిరేక చట్టాలపై చర్చించి భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తామని అప్పలనాయుడు తెలిపారు. ఎంతో ప్రతిష్ట కలిగిన ఈ సమయంలో రైతాంగాన్ని సమైక్యపరచడం, చైతన్యం తీసుకురావడం మరియు ఉద్యమానికి సిద్ధం చేయడం వంటి కీలక బాధ్యతలు సంఘంపై ఉన్నాయని ఆయన అన్నారు. జండా ఆవిష్కరణ కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఇవి నాయుడు, కోశాధికారి బొత్స గౌరు నాయుడు, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి తోట జీవన్, వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి గరుగుబిల్లి సురయ్య, యువజన సంఘం నాయకులు బిటి నాయుడు, విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.