
మద్దతు ధరకే రబీ ధాన్యం కొనాలి - మిల్లర్ల దందా అరికట్టాలని రైతుల డిమాండ్! జి.కొండూరు, ఏప్రిల్ 11దక్షిణాది : మద్దతు ధరలకే రబీలో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, ధరల నిర్ణయంలో మిల్లర్ల అక్రమాలను అరికట్టాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య, ఎన్టీఆర్ జిల్లా కౌలు రైతుల సంఘం అధ్యక్షుడు బుడ్డి రమేష్, రైతులు చెరుకూరి కుటుంబరావు, బుర్ర వెంకటేశ్వరరావు తదితరులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో జి.కొండూరు మండల తహసిల్దార్ వెంకటేశ్వరరావును కలిసి రైతులు వినతిపత్రం అందజేశారు. కవులూరు గ్రామంలో గత 15 రోజుల క్రితం వరి పంట కోసి ధాన్యం ఆరబెట్టి కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్తే అధికారులు రేపు, మాపు అంటూ ఇబ్బంది పెడుతున్నారని రైతులు తమ గోడును వినిపించారు. 17% లోపు తేమ శాతం ఉన్నప్పటికీ ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, మిల్లర్లు ధర నిర్ణయించిన తర్వాతే కొనుగోలు చేస్తామని కొనుగోలు కేంద్రంలోని అధికారులు చెబుతున్నారని రైతులు వాపోయారు. వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల ధాన్యం తడిసిపోతుందేమోనని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రబీ సీజన్‌లో ధాన్యాన్ని ఆరబెట్టుకోవడానికి, వర్షం వచ్చినప్పుడు తడవకుండా ఉండటానికి కనీసం పట్టాలు కూడా ఇవ్వలేదని రైతులు తమ నిరసన తెలిపారు. బుర్ర వెంకటేశ్వరరావు అనే రైతు పంట కోసి ఎనిమిది రోజులు గడిచినా కొనుగోలు చేయలేదని, రైతు చెరుకూరి కుటుంబరావు పంట కోసి ఆరబెట్టిన తర్వాత 17% లోపే తేమ శాతం ఉన్నప్పటికీ కొనుగోలు చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని రైతులు తమ కష్టాలను వివరించారు. 75 కేజీల బస్తా ధాన్యాన్ని రూ. 1740కి కొనుగోలు చేయాల్సి ఉండగా, మిల్లర్లు రూ. 1500లకే ఇస్తారా అని అడుగుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు గన్నీ బ్యాగులు కూడా ఇవ్వలేదని, మిల్లర్లు తేమ శాతం చూడాలని, ధర వారే నిర్ణయించాలని, మిల్లర్లు ఎవరికి సంచులు ఇవ్వమంటే వారికే ఇస్తామని కొనుగోలు కేంద్రంలోని అధికారులు చెప్పడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, తమను ఆదుకోవాలని రైతులు తహసిల్దార్‌ను వేడుకున్నారు. ఈ విధంగా కొనుగోలు కేంద్రాల అధికారులు అనేక అక్రమాలకు, అన్యాయాలకు పాల్పడుతున్నారని, వాస్తవానికి ప్రభుత్వ అధికారులు అయినప్పటికీ మిల్లర్ల చేతిలో కీలుబొమ్మలుగా మారారని రైతులు ఆరోపించారు. వెంటనే ఈ విషయంపై స్పందించి మద్దతు ధరల ప్రకారం ధాన్యం కొనుగోలు చేయాలని, మిల్లర్ల అక్రమాలు, అన్యాయాలను అరికట్టాలని, కొనుగోలు కేంద్రంలో మోసాలకు పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని రైతులు తహసిల్దార్‌కు విజ్ఞప్తి చేశారు. తహసిల్దార్ స్పందిస్తూ అధికారులతో మాట్లాడి రేపు ఉదయం 10 గంటలకు కవులూరులోని కొనుగోలు కేంద్రానికి వెళ్లి ధాన్యం అమ్ముకోవడంలో రైతులు పడుతున్న ఇబ్బందులను, ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.