
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో పీ-4 విధానం అమలు పేదరిక నిర్మూలన లక్ష్యంగా వినూత్న కార్యక్రమం : మంత్రి కొలుసు పార్థసారథి. ఆగిరిపల్లి (నూజివీడు నియోజకవర్గం), ఏప్రిల్ 11: ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనికతకు అనుగుణంగా జీరో పావర్టీ - పీ4 విధానం అమలవుతోందని రాష్ట్ర గృహ నిర్మాణం, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. శుక్రవారం నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లిలో మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి వేడుకలతో పాటు జరిగిన జీరో పావర్టీ - పీ4 ప్రజా వేదిక కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొప్ప సంఘ సంస్కర్త, అణగారిన వర్గాల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసిన మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి సందర్భంగా పీ-4 ప్రజా వేదిక కార్యక్రమం నూజివీడు నియోజకవర్గంలో జరగడం చాలా ఆనందంగా ఉందన్నారు. బడుగు బలహీన వర్గాలకు ఆత్మగౌరవం కల్పించాలని, వివక్షను రూపుమాపాలని దాదాపు 200 ఏళ్ల క్రితమే ఫూలే గొప్ప పోరాటం చేశారని ఆయన కొనియాడారు. పరిపాలన అంటే కేవలం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటరీ నియోజకవర్గాలే కాదని, అయిదు కోట్ల ప్రజల సంక్షేమమే అసలైన పరిపాలన అని గొప్ప పరిపాలనా దక్షతతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. దాదాపు 75 శాతం ఉన్న ఎస్‌సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ తదితర వర్గాల సంక్షేమం, అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు. ఈ వర్గాల పిల్లలకు మంచి భవిష్యత్తును అందించాలనే గొప్ప లక్ష్యంతో ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని ఒక గొప్ప స్థానానికి ముఖ్యమంత్రి తీసుకువెళ్తుంటే, గత అయిదేళ్లలో అన్ని రంగాల్లోనూ విధ్వంసం సృష్టించారని, భారీగా అప్పులు చేసి రాష్ట్రాన్ని దిగజార్చారని ఆయన విమర్శించారు. దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారని ఆయన ఆరోపించారు. అయినప్పటికీ అపార అనుభవం, గొప్ప దార్శనికత ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెడుతున్నారని, దేశంలోనే నెంబర్ వన్ దిశగా అడుగులు వేయిస్తూ నడిపిస్తున్నారని మంత్రి కొలుసు పార్థసారథి ధీమా వ్యక్తం చేశారు. సూపర్-6 పథకాల అమలుపై ప్రత్యేకంగా దృష్టి సారించారని, సంక్షేమంతో పాటు అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన తెలిపారు. గత ప్రభుత్వంలో మల్లవల్లి నుంచి కోట్లాది రూపాయల పెట్టుబడులు పెట్టిన వారు సైతం మూత వేసుకొని వెళ్లిపోయారని, అయితే తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ అశోక్ లేల్యాండ్ ప్రారంభమైందని, చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా ప్రారంభమవుతోందని, ఇలాంటి వాటి వల్ల యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన వివరించారు. యువనేత నారా లోకేశ్ ఒక్క జూమ్ కాల్‌తోనే దాదాపు లక్షా 30 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ రాష్ట్రానికి వచ్చిందని, దీనికి సంబంధించి క్యాబినెట్‌లో వివిధ నిర్ణయాలు జరిగాయని ఆయన వెల్లడించారు. ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ ఎస్‌సీ, ఎస్టీలతో పాటు బీసీలకు సొంతింటి కోసం రూ. 3,500 కోట్ల అదనపు భారాన్ని ప్రభుత్వం తీసుకుందని ఆయన తెలిపారు. పుణ్యభూమి, జన్మభూమికి సేవ చేయాలనే తపనతో పేదరికంలో ఉన్న వారిని పైకి తీసుకురావాలనే స్ఫూర్తిని నింపేందుకు పీ4 కార్యక్రమం అమలవుతోందని ఆయన అన్నారు. రాష్ట్రంలోని దాదాపు కోటి 50 లక్షల కుటుంబాల్లో ప్రతి కుటుంబం నుంచి ఒక వ్యాపారవేత్త ఉండాలనేది ముఖ్యమంత్రి ఆశయమని, ఉన్న నైపుణ్యాలను ఉపయోగించుకుంటూ, ప్రభుత్వ సహకారాన్ని సద్వినియోగం చేసుకుంటూ వ్యాపారవేత్తలుగా ఎదగాలని మంత్రి కొలుసు పార్థసారథి పిలుపునిచ్చారు. జిల్లాలోని నూజివీడు, చింతలపూడి వంటి మెట్ట ప్రాంత భూములను సస్యశ్యామలం చేసేందుకు చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని, పోలవరం కుడి ప్రధాన కాలువ నుండి లిఫ్ట్ ఇరిగేషన్ మంజూరు చేస్తే 20 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి స్వాగతం పలుకుతూ జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాను పారిశ్రామికంగా ముందుకు తీసుకువెళుతున్నామని తెలిపారు. పీ4 సర్వేలో జిల్లాలో 99 వేల మంది అత్యంత నిరుపేదలుగా గుర్తించామని, ఈ కుటుంబాలను మార్గదర్శకుల సహకారంతో అభివృద్ధిలోకి తీసుకువచ్చేందుకు ప్రణాళిక రూపొందించామని ఆమె వివరించారు. ఆగిరిపల్లిలో సీసీ రోడ్లు, డ్రైనేజీ సౌకర్యాలను పూర్తి స్థాయిలో కల్పిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఆగిరిపల్లిలో 12 కిలోమీటర్లకు గాను 4.2 కిలోమీటర్లే సీసీ రోడ్లు ఉన్నాయని, 20 కిలోమీటర్ల డ్రైనేజీ కల్పించాల్సి ఉండగా ఒక కిలోమీటర్ మాత్రమే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉందని, వీటిని రానున్న మూడు సంవత్సరాలలో పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.