"అది సెప్టెంబర్ నెల 29వ తేదీ సోమవారం...,సమయం దాదాపు మధ్యాహ్నం 3 గంటలు..., ఓ అంబులెన్స్ వాహనం నగరంలోకి వచ్చేందుకు కూతతో గోలపెడుతోంది"..., దసరా పండుగ ముందురోజులు కావడంతో అటు మలక్పేట నుండి ఇటు చాదరఘాట్ వరకు రోడ్డు అత్యంత రద్దీగా మారిపోయింది. సామాజిక స్పృహ ఉన్న కొందరు యువకులు ఆ వాహనాన్ని ముందుకు పంపే ప్రయత్నం చేసినా అది సాధ్యం కాలేదు. కిలోమీటరు కూడా లేని ఆదారి దాటడానికి అరగంట సమయం పట్టింది ఆ అత్యవసర వాహనానికి. ఈ సమస్య ఆ ఒక్క రోజుకి మాత్రమే పరిమితం కాలేదు. నిరంతరం నగరంలో అంబులెన్స్ వాహనానికి ఇలాంటి అపశృతులే ఎదురవుతున్నాయి. దీన్ని అధిగమించేందుకు అన్నట్టు అనేక సందర్భాల్లో ప్రభుత్వాల పెద్దల పెదవుల మీదనుంచి వచ్చే సానుభూతి మాటలే "అత్యవసరానికి ప్రత్యేక దారి ఏర్పాటు". ఆ "అత్యవసర ప్రత్యేక దారి సంవత్సరాలుగా కల"గానే మిగిలిపోతోంది. ముఖ్యంగా మహా నగరాల్లోని ట్రాఫిక్ రద్దీ కారణంగా "అత్యవసర అంబులెన్సుల" రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతూ విలువైన ప్రాణాలను గాలిలో కలిసిపోతున్న సంఘటనలు అనేకం. ఈ సమస్యకు ఒక వినూత్నమైన పరిష్కారం "సంజీవినీ మార్గం"!.... కేవలం నియంత్రణ, పౌర స్పృహను ఉపయోగించి రోడ్డు విస్తరణ అవసరం లేకుండానే, ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలు కాపాడే అవకాశం దక్కుతుంది. ప్రత్యేక దృష్టి సారిస్తే ఈ ప్రణాళిక నగర ట్రాఫిక్ నిర్వహణలో ఒక మైలురాయిగా నిలిచిపోయే అవకాశం ఉంది..! ఎస్సీ హెచ్ రంగయ్య . .............................. దక్షిణాది న్యూస్ : రోడ్డు విస్తరణ అక్కర్లేదు... కూడళ్ళే కీలకం..! ప్రధానంగా ట్రాఫిక్ సిగ్నల్స్ మరియు రద్దీ కూడళ్ల (జంక్షన్ల) వద్దే ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీన్ని అధిగమించేందుకు 'సంజీవినీ మార్గం' ఆలోచన అద్భుత ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. రద్దీ ప్రాంతాల్లోని కూడళ్ల వద్ద ఈ విధానాన్ని పక్కాగా అమలు చేస్తే, నగరం నలుమూలలకూ అంబులెన్సులు వేగంగా చేరగలవు. 'సంజీవినీ మార్గం' ప్రణాళికలోని కీలకమైన అంశాలు: ప్రతి ప్రధాన కూడలి వద్ద అత్యవసర వాహనం పట్టేంత ప్రత్యేక దారిని కనీసం వంద మీటర్ల పొడవు వరకు స్పష్టమైన గీతలతో గుర్తించాలి...... "బస్సుల్లో ఈ సీట్లు ఆడవారికి మాత్రమే" అనే నినాదంలా ఈ దారి అంబులెన్సుల కోసం ప్రత్యేకించబడిన 'రహదారిగా' గా వాహనదారులకు తెలిసేలా చేయాలి. సాధారణ సమయాల్లో సహాజంగానే వాహనాలు ఉపయోగించుకోవచ్చు. ద్వి-సైరన్ వ్యవస్థ.... అత్యంత కీలకం.! సహజ సైరన్‌తో పాటు అంబులెన్స్ వాహనం ఈ 'సంజీవినీ మార్గం' పరిధిలోకి రాగానే మరో ప్రత్యేకమైన మరో సైరన్‌ను మోగించాలి. ఈ సంకేతం, అంబులెన్స్ తన అత్యవసర స్థితిని ప్రకటిస్తున్నట్టుగా వాహనదారులకు హెచ్చరికగా పనిచేస్తుంది. ఈ ప్రత్యేక సైరన్ మోగిన వెంటనే ఆ అత్యవసర దారికి రెండు వైపులా ఉన్న వాహనాలు తక్షణమే అచేతన స్థితిలోకి వెళ్ళాలి. సంజీవినీ దారిలోని వాహనాలు మాత్రం తక్షణమే ముందుకు వెళ్లేలా పోలీస్ లు చర్యలు తీసుకోవాలి. దారి రాజమార్గం లా మారడంతో ట్రాఫిక్ సిగ్నల్స్ తో సంబంధం లేకుండా 'సంజీవినీ మార్గం'లో అంబులెన్సు వాహనం దూసుకుపోగలదు. అయితే భారీ రద్దీ ఉన్న కొన్ని సందర్భాల్లో... 100 మీటర్ల పరిధికి ముందే అంబులెన్స్ ప్రత్యేక సైరన్ మోగించాలి. అప్పుడు వాహనదారులు వెంటనే తమ వాహనాలను పక్కకు జరిపి, 'సంజీవినీ మార్గం' ఏర్పడేందుకు సహకరించడం ద్వారా పౌర బాధ్యతను కూడా చాటుకోగలరు. అంబులెన్స్ వాహనం జంక్షన్ దాటేంతవరకు నలువైపులా రెడ్ సిగ్నల్ కొనసాగాల్సిన అవసరాన్ని పోలీస్ కొనసాగించాలి. పరిష్కారం వెనుక ఉన్న మానవతా కోణం... ఈ వినూత్న విధానం విజయవంతం కావాలంటే పెద్ద ఎత్తున 'పౌర స్పృహ'ను పెంచాలి. "అంబులెన్సుకు దారి ఇవ్వడం అంటే ఒక ప్రాణాన్ని నిలబెట్టడం" అనే సందేశాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలి. కొత్త సైరన్ ప్రాముఖ్యత, దానికి స్పందించాల్సిన తీరుపై డ్రైవర్లకు, వాహనదారులకు విస్తృత ప్రచారం కల్పించాలి. 'సంజీవినీ మార్గం' అమలు ద్వారా నగరంలో ప్రత్యేక లేన్‌ల కోసం భారీగా మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉండదు. సరైన సాంకేతికత (ప్రత్యేక సైరన్‌లు, ఇండికేషన్లు) మరియు సామాజిక బాధ్యత (తక్షణ అచేతన స్థితి) కలయికతో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని "దక్షిణాది న్యూస్" అభిప్రాయపడుతోంది. ప్రభుత్వాలు, ట్రాఫిక్ పోలీసులు ఈ వినూత్న ఆలోచనను పరిగణలోకి తీసుకొని తక్షణమే పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేస్తే ఈ సంజీవినీ మార్గం రోగుల ప్రాణాలకు శ్రీరామ రక్షగా మారుతుందనేది వాస్తవం. ఈ 'సంజీవినీ మార్గం' భవిష్యత్తులో దేశవ్యాప్తంగా అమలు చేయదగిన ఆదర్శవంతమైన నమూనాగా నిలవడమేగాక మన నగరాలను మానవతా విలువలు గల, అభివృద్ధి చెందిన నగరాలుగా మారుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని పలువురు అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు.