జీ ఎస్టీ తగ్గింపు ఈవీ రంగానికి శాపం : - క్లీన్ ఎనర్జీ లక్ష్యాలకు అడ్డంకి! -- ఈవీ వాహనాలకు జీఎస్టీ జీరో శాతం కుదించాలి. - కేంద్ర ప్రభుత్వానికి లేఖ. హైదరాబాద్: అక్టోబర్ 6 (దక్షిణాది న్యూస్) : కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెట్రోల్ మరియు డీజిల్ వాహనాలపై తీసుకున్న జీ ఎస్టీ తగ్గింపు నిర్ణయం దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) విక్రయాలను తీవ్రంగా దెబ్బతీస్తోందని ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (ఈపడీసీ) ఫౌండర్ ప్రెసిడెంట్ ఎస్.సి.హెచ్. రంగయ్య తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం కేంద్ర ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు.సాంప్రదాయ వాహనాల ధరలు తగ్గడం వల్ల వినియోగదారులు మళ్ళీ పాత వాహనాలవైపే మొగ్గు చూపుతున్నారని, ఇది దేశ క్లీన్ ఎనర్జీ లక్ష్యాలకు పెను ప్రమాదమని ఆయన హెచ్చరించారు. "పెట్రోల్, డీజిల్ వాహనాల కొనుగోలు వ్యయం తగ్గడం ఒకవైపు ఉంటే, ఈవీ ల ప్రారంభ పెట్టుబడి ఇప్పటికే చాలా అధికంగా ఉంది. ఈ ధరల వ్యత్యాసం కారణంగానే సాధారణ ప్రజలు ఈవీ లు కొనేందుకు వెనకడుగు వేస్తున్నారు" అని రంగయ్య పేర్కొన్నారు. "ప్రభుత్వం ఒకవైపు కాలుష్యాన్ని తగ్గించాలని పిలుపునిస్తూనే, మరోవైపు పన్ను తగ్గింపు ద్వారా పెట్రోల్ వాహనాల డిమాండ్‌ను పెంచడం అనేది విరుద్ధమైన చర్య" అని ఆయన విమర్శించారు. దేశంలో ఈవీల విస్తరణ వేగం పుంజుకోవాలంటే, కేంద్ర ప్రభుత్వం తక్షణమే కొన్ని విప్లవాత్మక చర్యలు తీసుకోవాలని రంగయ్య గట్టిగా డిమాండ్ చేశారు. ఈవీల తయారీలో కీలకమైన బ్యాటరీల ధరలు అధికంగా ఉన్న కారణంగా తయారీ వ్యయం పెరుగుతోంది. పెట్రోల్ వాహనాలకు దీటుగా పోటీ ఇవ్వాలంటే, ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలపై ఉన్న జీ ఎస్టీ పూర్తిగా తగ్గించాలి" అని ఆయన విజ్ఞప్తి చేశారు. అంతేగాక ప్రస్తుతం అమలులో ఉన్న 'ఫేమ్' పథకం కింద ఇచ్చే రాయితీలు సరిపోవడం లేదు. ఉదాహరణకు 2లక్షల అథెర్ ద్విచక్ర వాహనం కొంటే కేవలం 5వేల రూపాయలు అంటే కనీసం 3శాతం కూడా లేకపోవడం హాస్యాస్పదమన్నారు. ఈ సబ్సిడీలను గణనీయంగా పెంచి, అవి నేరుగా కొనుగోలుదారులకు త్వరగా చేరేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. "సాంప్రదాయ వాహనాల ధరల తగ్గింపు కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమే. కానీ, దీర్ఘకాలికంగా పర్యావరణ పరిరక్షణ, ఇంధన భద్రత మరియు దేశ ఆర్థిక వ్యవస్థకు ఈవీ లే కీలకం. ఈ ధరల వ్యత్యాసాన్ని సరిచేసేలా కేంద్రం తక్షణ నిర్ణయం తీసుకోవడం అత్యవసరం" అని రంగయ్య డిమాండ్‌ను చేశారు. కేంద్ర ప్రభుత్వ తక్షణమే దృష్టి సారించి ఈవీల ధరల తగ్గింపుపై తగిన చర్యలు తీసుకొని పర్యావరణ పరిరక్షణ వాదాన్ని నిలబెట్టుకుంటుందన్న ఆశాభావాన్ని ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ వ్యక్తం చేస్తుందన్నారు.