సంసృతి సంప్రదాయాల నెలవైన భారతీయ సమాజం నేడు పాశ్చాత్య పోకడలవైపు పరుగెడుతూ తన ఔన్నత్యాన్ని కోల్పోతోంది. ఇందుకు ప్రధాన కారణం సినిమా రంగమే అన్నది కాదనలేని వాస్తవం. కౌమారం దాటి యుక్తవయసులోకి అడుగుపెడుతున్న యువతను ఈ సినిమా మీడియా తన స్వలాభం కోసం ఆకర్షించి కట్టిపడేస్తున్నాయి. ఏదో తెలీని మత్తులో యువత ఒకటికి పదిసార్లు సినిమాలు చూస్తూ అన్ని రకాలుగా నష్టపోతున్నారు. సేదతీరేందుకు ఎంటర్టైన్ చేయాల్సిన సినిమా యువతను బానిసలను చేస్తోంది. ఆ బానిసత్వం మరో రూపంలో దర్శకులు డబ్బు మీద వ్యామోహంలో అవసరం లేకున్నా అసభ్యతకు పెద్ద పీట వేస్తున్నారు..! ఎస్సీ హెచ్ రంగయ్య - ----------------------------------- దక్షిణాది న్యూస్ - హైదరాబాద్ : దర్శకుడు క్రిష్ జాగర్లమూడి రూపొందించిన 'ఘాటి' చిత్రం, అనుష్క శెట్టి పవర్‌ఫుల్ పాత్రతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించింది. ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లోని తూర్పు కనుమల్లో జరిగే గంజాయి అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ పోరాట గాథ, శీలవతి అనే గిరిజన మహిళ (అనుష్క) తిరుగుబాటును చూపిస్తుంది. సినిమా కథాంశం బలమైన సామాజిక నేపథ్యాన్ని, దోపిడీకి వ్యతిరేకంగా మహిళా నాయకురాలి పోరాటాన్ని ఎంచుకున్నప్పటికీ, కొన్ని సన్నివేశాల్లో అసభ్యత హద్దులు దాటిందనే విమర్శ బలంగా వినిపిస్తోంది. బలమైన కథాంశం- పక్కదారి పట్టిన కథనం 'ఘాటి' సినిమా కథాంశం ఎంతో సమకాలీనమైనది మరియు సామాజిక ప్రాధాన్యత కలిగినది. గిరిజనుల దోపిడీ, డ్రగ్ మాఫియా అరాచకాలు వంటి వాస్తవ అంశాలను క్రిష్ ఎంచుకున్నారు. అనుష్క శెట్టి శీలవతి పాత్రలో బాధితురాలిగా, నేరస్తురాలిగా, చివరికి నాయకురాలిగా ఎదిగే క్రమాన్ని విశ్వసనీయంగా చూపించారు. ఈ పాత్ర, మహిళా సాధికారతకు ఒక ఉదాహరణగా నిలుస్తుందనే నమ్మకాన్ని కలిగించింది. అయితే ఇంతటి అద్భుతమైన కథావస్తువును ఎంచుకున్న దర్శకుడు, కథనాన్ని నడిపించడంలో ఎక్కడో అభద్రత కు లోనైనట్లు కనిపించింది . బలమైన సన్నివేశాల మధ్యలో, అనవసరమైన అసభ్య కట్టుబొట్టు , విపరీత వస్త్రధారణ ఉన్న సన్నివేశాలను జోడించడం ఈ అభద్రతకు నిదర్శనం. సినిమా యొక్క ముఖ్య సందేశం నుండి దృష్టి మళ్లించే ఇలాంటి సన్నివేశాలు, కథ యొక్క గాఢతను తగ్గించాయి. కుటుంబ ప్రేక్షకులను దూరం చేసుకున్న 'వల్గారిటీ' ఇటీవల కాలంలో కుటుంబ సభ్యులతో కలిసి చూసే సినిమాలు రావడం లేదనే విమర్శలు తెలుగు సినిమాపై బలంగా ఉన్నాయి. 'ఘాటి' వంటి సామాజిక నేపథ్యం ఉన్న సినిమా ఆ వెలితిని భర్తీ చేస్తుందని ఆశించిన ప్రేక్షకులకు, కొన్ని అసభ్య సన్నివేశాలు నిరాశ కలిగించాయి. ముఖ్యంగా, విలన్ ఇలాకాలో ఒక మహిళా పాత్రను ఉద్దేశపూర్వకంగా 'స్విమ్మింగ్ డ్రెస్' వంటి విపరీత వస్త్రధారణలో, అత్యంత అసభ్యంగా చూపాల్సిన అవసరం ఏమొచ్చిందనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ సీన్లు కథకు తప్పనిసరి కాదని స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ కేవలం ప్రేక్షకులను ఆకర్షించే ఉద్దేశంతోనే వాటిని జోడించారనే విమర్శ వినిపిస్తోంది. ఈ వల్గారిటీ హద్దులు దాటడం వల్ల సినిమా చూడడానికి వచ్చిన కుటుంబ ప్రేక్షకులతో ఛీ అనిపించుకుని థియేటర్ల నుండి దూరమయ్యే ప్రమాదం నెలకొంది. సామాజిక విలువలను చెడగొడుతున్న ట్రెండ్.... దర్శకులు సినిమా ద్వారా ఒక సామాజిక సందేశాన్ని అందించాలనుకున్నప్పుడు, ఆ సందేశాన్ని బలోపేతం చేసే అంశాలకే ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ, 'ఘాటి' వంటి సినిమాలు, ఒకవైపు మహిళా పోరాటాన్ని చూపిస్తూనే, మరోవైపు అసభ్యతను ప్రదర్శించడం అనేది తెలుగు సినీ పరిశ్రమలో ఒక ప్రమాదకరమైన ట్రెండ్‌గా మారుతోంది. భయం గుప్పిట్లో దర్శకులు...! బలమైన కథ ఉన్నప్పటికీ, కేవలం "కమర్షియల్ సక్సెస్" కోసమో లేదా "సామాన్య డైరెక్టర్ మాదిరి" భయపడో ఇటువంటి అవాంఛనీయ అంశాలను క్రిష్ చేర్చారనే విమర్శ బలంగా ఉంది. ఇది సృజనాత్మక స్వేచ్ఛ ను పక్కనపెట్టి, వసూళ్లపైనే దృష్టి పెట్టడాన్ని సూచిస్తుంది. సినిమా అనేది సమాజాన్ని ప్రభావితం చేసే శక్తివంతమైన మాధ్యమం. వల్గారిటీ హద్దులు దాటుతున్న తెలుగు సినిమా తీరు ప్రేక్షకులలో ముఖ్యంగా యువతలో అసభ్యత పట్ల క్రేజ్ పెంచుతుంది. తద్వారా సామాజిక విలువలను పరోక్షంగా దెబ్బతీస్తుంది. ఇప్పటికైనా దర్శకులు అసభ్యతను నమ్మడం మాని బలమైన కథ మరియు పవర్‌ఫుల్ నటన పెద్దా పీట వేసి కథకు అనవసరమైన అంశాలను జోడించి ప్రేక్షకులకు ఏ సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారో స్పష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.