వరద బాధిత రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి -- ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె వి వి ప్రసాద్ డిమాండ్. అమరావతి, అక్టోబర్ 4(దక్షిణాది న్యూస్) : కృష్ణా నది వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.వి.వి. ప్రసాద్ ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కృష్ణా పరివాహక ప్రాంతాలైన ఘంటసాల, చల్లపల్లి మండలాల్లో శనివారం పర్యటించిన రైతు సంఘం బృందం నష్టపోయిన పంటలను పరిశీలించింది. ఈ సందర్భంగా కేవీపీ ప్రసాద్ మాట్లాడుతూ.... , ప్రకాశం బ్యారేజీ నుంచి 7 లక్షల క్యూసెక్కుల వరద నీరు విడుదల కావడంతో కంద, పసుపు వంటి వాణిజ్య పంటల రైతులకు ఎకరాకు సుమారు రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లిందని తెలిపారు. నష్టాన్ని అంచనా వేసే అధికారులు రాజకీయాలకు అతీతంగా, వాస్తవ సాగుదారులకు న్యాయం జరిగేలా అంచనాలను రూపొందించాలని కోరారు. ప్రభుత్వం ప్రస్తుతం అందిస్తున్న నష్టపరిహారాన్ని పెంచాలని, ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవడానికి అవసరమైన రుణాలు, 100% సబ్సిడీతో విత్తనాలు, పురుగుమందులు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. సర్వే నెంబర్‌ను యూనిట్‌గా తీసుకొని పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని, తాము పరిశీలించిన విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని ఆయన వివరించారు.