EPDC News India
EPDC News Logo

Environment Protection Development Council-EPDC

Latest News

Image

ఎరువులపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు - కూటమి ప్రభుత్వం పై వైసిపి విష ప్రచారం దుర్మార్గం. - రైతులకు అండగా కూటమి ప్రభుత్వం. - తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాతర్ల రమేష్. అమరావతి - దక్షిణాది బ్యూరో : కూటమి ప్రభుత్వంపై వైసిపి చేస్తున్న దుష్ప్రచారం అన్యాయమని, ఎరువులపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాతర్ల రమేష్ హెచ్చరించారు. రైతులకు కూటమి ప్రభుత్వం వంద శాతం అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. శనివారం ఆయన మంగళగిరిలో విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్రంలో యూరియా సరఫరాకు ఎలాంటి సమస్య లేదని, అయినప్పటికీ వైసిపి నాయకులు నీచ రాజకీయాలు చేస్తూ, రైతులను మోసం చేస్తూ తమ కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. సోషల్ మీడియాలో వైసిపికి చెందినవారు యూరియా కొరతపై తప్పుడు పోస్టులు పెట్టి, రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం హెచ్చరించినా వైసిపి నాయకులకు బుద్ధి రాలేదని, వారు కూటమి ప్రభుత్వంపై బురద జల్లేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని రైతులు ఎరువుల కొరత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, డిమాండ్ కంటే ఎక్కువగా ఎరువులు అందుబాటులో ఉంచి, రైతుల పంటల సాగు నిరాటంకంగా కొనసాగేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని స్పష్టం చేశారు. శుక్రవారం నాటికే 94,892 టన్నుల యూరియా అందుబాటులో ఉండగా, వచ్చే పది రోజుల్లో మరో 30 వేల టన్నులు రానున్నాయని తెలిపారు. సెప్టెంబర్ చివరి నాటికి 2.75 లక్షల టన్నులు రైతులకు అందుబాటులో ఉంటాయని, కేంద్రం 9.38 లక్షల టన్నులు కేటాయించడంతో రైతులకు ఎరువుల సమస్య లేకుండా ఏపీ ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని వివరించారు. అయినప్పటికీ వైసిపి నేతలు ప్రభుత్వంపై అవాస్తవ పోస్టులతో మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఎరువుల దారి మళ్లింపుపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని, యూరియా దారి మళ్ళిస్తే "6 ఏ కింద కేసులు నమోదవుతాయని" తెలిపారు. ఇప్పటివరకు 3 కోట్ల రూపాయల విలువైన 1,284 టన్నుల యూరియా సీజ్ చేయడం దీనికి నిదర్శనమని చెప్పారు. అయినా, వైసిపి నాయకులు ఎరువులు లేవని, రైతులు ఇబ్బంది పడుతున్నారని దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అబద్ధమే వారి ఆక్సిజన్ అని, తప్పుడు ప్రచారమే వారి రాజకీయ బ్రతుకుగా మారిందని ఎద్దేవా చేశారు. కానుగ పంటకు బోర్డర్ తెగులు సోకినప్పుడు ప్రభుత్వం అండగా నిలిచి, పది లక్షల రూపాయలు పరిహారం, ట్రాక్టర్ల కోసం 50 లక్షలు విడుదల చేసిందని గుర్తు చేశారు. వంద రోజుల్లోనే 3,800 కోట్లు ఖర్చుపెట్టి కాలువలకు నీరు అందించామని, ఇవన్నీ రైతు పక్షపాత చర్యలని తెలిపారు. కానీ వైసిపికి ఇవి కనిపించవని, వారి కలలన్నీ దుష్ప్రచారం చేయడమేనని విమర్శించారు. నీళ్లు ఇస్తే "కుప్పానికి నీరు ఎందుకు" అని, ఎరువులు తెస్తే "రైతుల చేతికి చేరటం లేదు" అని వారు గగ్గోలు పెడుతున్నారని ఆయన విమర్శించారు. మామిడి పండ్లను రోడ్లపై పోయించి తొక్కించిన వారు ఎవరో, కోకో విషయంలో డ్రామాలు ఆడినవారు ఎవరో ప్రజలు మరిచిపోలేదని, ఇప్పుడు యూరియాపై కూడా అదే అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పదవీ విరమణ వయసు పెంపుపైనా నకిలీ జీవోలు సృష్టించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మహిళలపై వ్యక్తిత్వ హననానికి పాల్పడిన వైసిపి నేతలు, రాజధానిపైనా ఇదే రకమైన అబద్ధపు ప్రచారం చేయడం సైకో బ్యాచ్ కి అలవాటు అయిందని విమర్శించారు. ఇప్పుడు రైతుల మనసుల్లో గందరగోళం సృష్టించడం వారి కొత్త వ్యూహమని, కానీ ఎంత అబద్ధాలు ప్రచారం చేసినా వాస్తవాలు ఎప్పటికీ మునిగిపోవని ప్రజలందరూ తెలుసుకున్నారని తెలిపారు. గతంలో జగన్ రెడ్డి పాలనలో ఎరువుల కొరత, బ్లాక్ మార్కెట్లో సరఫరాలో అవ్యవస్థ కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని, ఈ వాస్తవాలను వైసిపి నాయకులు విస్మరిస్తున్నారని పాతర్ల రమేష్ అన్నారు.