ప్లాస్టిక్ వ్యర్థ కాసారంగా "జల వనరు..!" --- నిజాంపేట పరిధిలో 'ప్రగతినగర్ చెరువు' దుస్థితి. - అధికారుల ఉదాసీనతపై స్థానికుల ఆగ్రహం – పట్టించుకోకపోతే భవిష్యత్తులో మురికి కూపమే! దక్షిణాది న్యూస్ : -------------------------------------------------------- హైదరాబాద్ - ప్రగతినగర్/నిజాంపేట: నగర ప్రజల ఆహ్లాదం కోసం, అవసరాలకు అత్యంత కీలకంగా భావించే నీటి వనరులను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత కేవలం మాటలకే పరిమితమైంది అనడానికి నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతినగర్ చెరువు ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తోంది. చూపరులను ఆకట్టుకునేలా రెండుగా చీలి ప్రశాంతంగా కనిపించిన ఈ చెరువు, ప్రస్తుతం స్థానిక అధికారులు మరియు సిబ్బంది యొక్క తీవ్ర ఉదాసీనత కారణంగా కనుమరుగయ్యే ప్రమాదంలో ఉంది. చెరువు నిండా ప్లాస్టిక్ వ్యర్థాలు: ప్రగతినగర్ చెరువు కట్ట ప్రాంతం భారీ మొత్తంలో పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు, సాధారణ చెత్తాచెదారంతో కప్పేయబడింది. అంతకుమించి, ప్లాస్టిక్ వ్యర్థాలు నేరుగా చెరువు నీటిలో కలిసిపోతున్నాయి. దీని ఫలితంగా చెరువు క్రమంగా మురికి కూపంగా మారుతోంది. ఈ వ్యర్థాలకు తోడు, చెరువు కట్టపై కొనసాగుతున్న మాంసం, కోళ్ల మాంసం, చేపల దుకాణాల నుండి వచ్చే వ్యర్థాలు కూడా నిరంతరం చెరువులో కలుస్తుండటం పరిస్థితిని మరింత దయనీయంగా మారుస్తోంది. చెరువు కట్టపై చేరితే పలకరించాల్సిన చల్లగాలి స్థానంలో దుర్గంధం రాజ్యమేలుతోంది..! ప్రజాధనాన్ని లక్షలు వెచ్చించి తొలగించిన గుర్రపుడెక్క, నీటి పాచిని అధికారులు అదే కట్టపై రాశులుగా పోసి నెలలు గడుస్తున్నా తొలగించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తుగా పేర్కొనవచ్చు. పట్టించుకోని జీ హెచ్ ఏం సి , నిజాంపేట సిబ్బంది: చెరువు పరిరక్షణ బాధ్యత వహించాల్సిన జీహెచ్‌ఎంసీ (జీ హెచ్ ఏం సి) మరియు నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ఎప్పటికప్పుడు చెత్తను తొలగించడంలో మరియు వ్యర్థాలు వేయకుండా వ్యాపారాలను కట్టడి చేయడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. నిరంతరం క్షేత్రస్థాయి పరిశీలన జరిపి, ఈ ట్యాంక్ బండ్ పై పాతుకుపోయిన అక్రమ వ్యాపారాలను నియంత్రించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అధికారుల ఈ నిర్లక్ష్యం కారణంగా రానున్న కొద్ది రోజుల్లో ప్రగతినగర్ చెరువు పూర్తిగా మురికికూపంగా మారడం ఖాయమని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్ అవసరాల కోసం మిగిలిన ఈ జలవనరును కాపాడుకోవడానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.