హైదరాబాద్- కూకట్ పల్లి , దక్షిణాది న్యూస్ : "అడగనిది అమ్మ అయినా అన్నం పెట్టదు" అన్నట్టుగా... కూకట్‌పల్లి పరిధిలోని రోడ్డు కస్టాలు ఎదుర్కొంటున్న బాచుపల్లి ప్రాంత ప్రజలు అడగందే ప్రభుత్వం స్పందించేలా లేదు. ఇంటి కోసం కోట్లాది రూపాయల పన్నులు చెల్లించిన ఇక్కడి ప్రజలు ఇంటినుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు. మియాపూర్ ప్రధాన రహదారిని అనుకోని ఉన్న "రెడ్డి ల్యాబ్ బాచుపల్లి క్యాంపస్" సమీపంలోని రోడ్డు గుంతలతో తాజా వర్షాలకు మోకాళ్ల లోతు నీరు నిలిచి ప్రణీత్ ప్రణవ్ ఎంక్లేవ్ గేటెడ్ కమ్యూనిటీ నివాసితులకు చుక్కలు చూపుతోంది. ఈ రోడ్డు స్కూల్ బస్సుల రాకపోకలకు నరకం చూపిస్తోంది. ఖరీదైన ఈ ప్రాంతంలో ఇళ్ల కొనుగోలు సమయంలో ప్రభుత్వానికి భారీగా టాక్స్‌లు చెల్లించినా, కనీస రోడ్డు సదుపాయం లేకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యపై స్థానిక నివాసితులు మౌనంగా ఉన్నా స్థానిక నాయకులు గాని, అధికారులు గాని సమస్యపై దృష్టి సారించకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. సమీపంలో జరుగుతున్న వంతెన నిర్మాణం పనులు మరిన్ని కష్టాలు పెంచాయి. వంతెనతో సంబంధం లేకుండా అధికారులు తక్షణమే జోక్యం చేసుకుని, ఈ రోడ్లను యుద్ధ ప్రాతిపదికన నవీకరించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.