అమెరికాలో అదరహో దసరా....: న్యూజెర్సీలో వేలాది తెలుగు కుటుంబాల వేడుక! న్యూజెర్సీ (అమెరికా) దక్షిణాది ప్రత్యేక ప్రతినిధి : అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో న్యూజెర్సీలోని రాయల్ అల్బర్ట్ ప్యాలెస్ దసరా శోభతో వెలిగిపోయింది. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్వహించిన దసరా మహోత్సవాలు అక్టోబర్ 5 న అత్యంత వైభవంగా జరిగాయి. అమెరికాలోని వేలాదిమంది తెలుగు కుటుంబాలు భారీ సంఖ్యలో పాల్గొని పండుగ వాతావరణాన్ని మరింత రంగులమయం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైన డా. లయన్ కోమటి రెడ్డి గోపాల్ రెడ్డి కి ATA నాయకులు—ప్రెసిడెంట్ జయంత్ చెళ్ళా, సెక్రటరీ సాయి నాథ్ బోయపల్లి, ట్రెజరర్ శ్రీకాంత్, విలాస్ రెడ్డి, రెగట్ట రవీందర్ రెడ్డి, సత్యం కొంకిస, సామ అమరేందర్ రెడ్డి మరియు ఇతర సభ్యులు—ఘనంగా సన్మానం చేసి గౌరవించారు. ఈ సందర్భంగా ప్రముఖ విద్యావేత్త, పర్యావరణవేత్త, 'గ్లోబల్ గ్రీన్ మెంటర్ అవార్డు-2025' గ్రహీత అయిన గోపాల్ రెడ్డి ... విదేశీ గడ్డపై ఉత్సవాలు జరుగుతుండటం గర్వకారణమని పేర్కొన్నారు. డా. గోపాల్ రెడ్డి అక్కడి తెలుగు వారికి ఒక ముఖ్య సందేశాన్నిచ్చారు. "ప్రతి తెలుగు తల్లి, తండ్రి తమ పిల్లలకు తెలుగు చదవడం, వ్రాయడం నేర్పించాలి. మన భాష నేర్చుకున్నప్పుడే మన సంస్కృతి, ఆచారాలు, ఉత్సవ సంప్రదాయాలు తరతరాలకు చేరుతాయి అన్నారు. భాషను మర్చిపోతే, సంస్కృతిని కూడా కోల్పోతాం." అలాగే ఆయన పర్యావరణవేత్తగా, భవిష్యత్ తరాల కోసం పర్యావరణ రక్షణ అత్యవసరం అని గుర్తుచేస్తూ, పచ్చదనంతో కూడిన ఉత్సవాలను జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకలు దసరా అమెరికాలో తెలుగు సంస్కృతి పరిరక్షణకు, వారసత్వాన్ని అందించడానికి ఒక బలమైన వేదికగా నిలిచాయని పేర్కొంటూ డాక్టర్ రెడ్డి అమెరికన్ తెలుగు అసోసియేషన్ కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.