రియల్ ఎస్టేట్ కేంద్రంగా మెట్రో రైలు ప్రాజెక్ట్: - చర్చాగోష్టిలో వక్తల విమర్శ. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ ప్రయాణికుల ప్రయోజనాల కంటే రియల్ ఎస్టేట్ లాభాలకే అధిక ప్రాధాన్యత ఇచ్చిందని, అందుకే ఈ ఒప్పందం విఫలమై రాష్ట్ర ప్రభుత్వానికి భారంగా మారుతోందని ప్రొఫెసర్ సి. రామచంద్రయ్య తీవ్రంగా విమర్శించారు. హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం (HCF) ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 'మెట్రో రైల్ నష్టాలకు కారణమెవరు? భవిష్యత్ సవాళ్లు ఏమిటి?' అనే అంశంపై జరిగిన చర్చా గోష్టిలో ఆయన ముఖ్యవక్తగా పాల్గొన్నారు. మెట్రో రైల్ ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌గా మారిందని, ప్లానింగ్‌లో సామాన్యుడు కనుమరుగయ్యాడని ప్రశ్నించారు. ప్రయాణికుల సంఖ్య భారీగా పెరుగుతుందన్న ఎల్ & టీ (L&T) అంచనా విఫలమైందని, అలాగే కామన్ టికెట్ అమలుపై ఏ ప్రభుత్వం చిత్తశుద్ధి పాటించలేదని ఆరోపించారు. మెట్రో ప్రాజెక్టు పేరుతో బస్సు రవాణా, ఎంఎంటీఎస్, ఫుట్‌పాత్‌ల వ్యవస్థలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, గతంలో 36 ఫ్లైఓవర్లు నిర్మించినా ఒక్క ఫుట్‌పాత్ కూడా నిర్మించలేదని ఆయన ఎత్తి చూపారు. తెలంగాణ అర్బన్ డెవలప్‌మెంట్ ఫోరం కన్వీనర్ ఎం. శ్రీనివాస్ మాట్లాడుతూ... నష్టాల పేరుతో ఎల్ & టీ నిర్వహణ నుండి తప్పుకోవడం ఒప్పంద ఉల్లంఘనే అవుతుందని స్పష్టం చేశారు. ఎల్ & టీ తమ ఆర్థిక లక్ష్యాలు సాధించడంలో విఫలమైందని, నష్టాలకు పూర్తి బాధ్యత ఆ సంస్థే వహించాలని డిమాండ్ చేశారు. ఒప్పందానికి విరుద్ధంగా మెట్రో ఛార్జీలను భారీగా పెంచి సామాన్య ప్రయాణికులపై భారం మోపారని, సౌకర్యాలపై కనీసం శ్రద్ధ వహించలేదని విమర్శించారు. అంతేకాక, రైల్ కోచ్‌ల సంఖ్యను పెంచాలన్న డిమాండ్‌ను సైతం పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా, మెట్రో రైలు రెండో దశకు అనుమతి ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని, వెంటనే కేంద్ర సహాయం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ చర్చా గోష్టికి HCF అధ్యక్షుడు ఎం. శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు.