ఉల్లి రైతులకు చంద్రన్న భరోసా --: హెక్టారుకు ₹50 వేలు సాయం. అమరావతి, సెప్టెంబర్ 21(దక్షిణాది) : కష్టాల్లో ఉన్న ఉల్లి రైతులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఉల్లి పండించిన ప్రతి రైతుకు హెక్టారుకు ₹50,000 ఆర్థిక సాయం అందించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇది ఒక రికార్డు స్థాయి మద్దతు అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాతర్ల రమేష్ అన్నారు. ఆదివారం అమరావతిలో విలేకరులతో మాట్లాడిన ఆయన, ఈ నిర్ణయంతో కూటమి ప్రభుత్వం రైతు పక్షపాతి అని మరోసారి రుజువైందని కొనియాడారు. గత జగన్ ప్రభుత్వ హయాంలో ఉల్లి ధర కిలో ₹2కు పడిపోయినా, రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని పాతర్ల రమేష్ విమర్శించారు. జగన్ పాలనలో రైతులు రోడ్డెక్కిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని, 2019-2024 మధ్య రైతుల ఆత్మహత్యల్లో ఏపీ దేశంలోనే మూడో స్థానంలో ఉందని ఆయన ఆరోపించారు. జగన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన ధరల స్థిరీకరణ నిధి హామీని అమలు చేయలేదని, కేవలం 250 మంది రైతుల నుంచి మాత్రమే కొంత ఉల్లిని కొనుగోలు చేసి చేతులు దులుపుకున్నారని రమేష్ మండిపడ్డారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం ₹100 కోట్లకు పైగా భారం పడినా వెనకడుగు వేయలేదని పాతర్ల రమేష్ తెలిపారు. కర్నూలు జిల్లాలోని 24,218 మంది ఉల్లి రైతులు ఈ ఆర్థిక సాయంతో లబ్ధి పొందనున్నారని వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు అందించిన పలు సహాయాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎన్నికల హామీ మేరకు రైతులకు తొలి విడత పెట్టుబడి సాయంగా ₹7,000 జమ. మామిడి రైతులకు కిలోకు ₹4 చొప్పున ₹260 కోట్లు జమ. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ. గత ప్రభుత్వం పెట్టిన ₹1,670 కోట్ల ధాన్యం బకాయిలను కూడా కూటమి ప్రభుత్వమే చెల్లించింది. రైతులకు 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ పథకం పునరుద్ధరణ. రైతు బాంధవుడు చంద్రన్న అని, రైతు ద్రోహి జగన్ అని పాతర్ల రమేష్ తీవ్రంగా విమర్శించారు.