దక్షిణాది న్యూస్ బ్యూరో - హైదరాబాద్ : సినిమాలు కేవలం వినోదం కోసమే కాకుండా దేశ సంస్కృతిని, సామాజిక విలువలను కాపాడాల్సిన బాధ్యత వాటిపై ఉందని "ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ కౌన్సిల్" వ్యవస్థాపక అధ్యక్షులు రంగయ్య డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన విడుదల చేసిన ఒక ప్రకటనలో... చలనచిత్రాల్లో ప్రదర్శించే అసభ్యకర సన్నివేశాల విషయంలో సినిమా నిర్మాతలు మరియు ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. పొగతాగే సన్నివేశాల్లో "పొగతాగరాదు - పొగతాగటం ఆరోగ్యానికి హానికరం" అనే ప్రకటన (డిస్‌క్లెయిమర్) తరహాలోనే, అసభ్యకర సన్నివేశాలు లేదా అసాంఘిక అంశాలు వెండి తెరపై ప్రసారమయ్యేటప్పుడు "ఇది భారతీయ సంస్కృతి కాదు" అనే ప్రకటనను తప్పనిసరిగా వచ్చేలా చర్యలు తీసుకోవాలని రంగయ్య డిమాండ్ చేశారు. సామాజిక పర్యావరణ సమతుల్యత లక్ష్యం: 2028లో భారతదేశం "COP 33 పర్యావరణ సదస్సు"కు ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో దేశంలో కేవలం పర్యావరణ సమతుల్యతను మాత్రమే కాకుండా, సామాజిక పర్యావరణం (సోషల్ ఎన్విరాన్మెంట్) లో కూడా సమతుల్యత సాధించాల్సిన అవసరం ఉందని ఆయన హెచ్చరించారు. సామాజిక విలువలను కాపాడటం ద్వారానే, భారతదేశం ప్రపంచ దేశాల ముందు తన ప్రత్యేకతను, ఉన్నత సంస్కృతిని సగర్వంగా నిలబెట్టుకోగలదని రంగయ్య పేర్కొన్నారు. ఈ దిశగా ప్రభుత్వం మరియు సినీ పరిశ్రమ తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.