
హైదరాబాద్: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై అసంతృప్తితో ఉన్న గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌తో కేంద్ర మంత్రి బండి సంజయ్ శనివారం కీలక చర్చలు జరిపారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎన్. గౌతమ్ రావు అభ్యర్థిత్వాన్ని రాజా సింగ్ వ్యతిరేకించిన నేపథ్యంలో బండి సంజయ్ స్వయంగా రంగంలోకి దిగి ఆయనతో మాట్లాడారు. ఈ భేటీ అనంతరం రాజా సింగ్ తన వైఖరిని మార్చుకున్నారు. బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావు గెలుపు కోసం కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. పార్టీ ఆదేశాల మేరకు నడుచుకుంటానని, ఎన్నికల్లో కార్పొరేటర్లతో సమన్వయం చేసుకుంటానని ఆయన తెలిపారు. సమావేశంలో బండి సంజయ్, గౌతమ్ రావును పిలిపించి రాజా సింగ్‌తో కరచాలనం చేయించారు. అనంతరం రాజా సింగ్, గౌతమ్ రావు ఒకరినొకరు శాలువాలతో సత్కరించుకున్నారు. పార్టీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటానని బండి సంజయ్ రాజా సింగ్‌కు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రాజా సింగ్ మాట్లాడుతూ... హైదరాబాద్‌లోని కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు బీజేపీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎంఐఎం అభ్యర్థిని ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. గతంలో తాను చేసిన వ్యాఖ్యలు వేరే సందర్భానికి సంబంధించినవని, ఇప్పుడు పార్టీ అభ్యర్థి విజయంపైనే దృష్టి సారిస్తానని ఆయన అన్నారు. అన్ని పార్టీల్లో విభేదాలు సహజమని, బీజేపీ తమకు తల్లి లాంటిదని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా తనతో పలుమార్లు మాట్లాడారని ఆయన గుర్తు చేశారు. బండి సంజయ్ మాట్లాడుతూ... రాజా సింగ్ బీజేపీకి క్రమశిక్షణ కలిగిన కార్యకర్త అని, కట్టర్ బీజేపీ నేత అని కొనియాడారు. ఈ భేటీకి ముందు బండి సంజయ్, రాజా సింగ్ కలిసి పాతబస్తీలోని ఆకాశ్ పురి హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం విశేషం.