
హైదరాబాద్: చైతన్య భారతీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సిబిఐటి)లో "సస్టైనబుల్ అభివృద్ధికి భారతీయ జ్ఞాన వ్యవస్థల పునరుద్ధరణ" అనే అంశంపై రెండు రోజుల జాతీయ కార్యాగోష్ఠి శనివారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా భారతీయ జ్ఞాన వ్యవస్థల కేంద్రం – విజ్ఞాన అనుసంధాన కేంద్రాన్ని సిబిఐటి అధికారికంగా ప్రారంభించింది. ఐసిఎస్ఎస్ఆర్, భారత విద్యా మంత్రిత్వ శాఖల స్పాన్సర్‌షిప్‌తో ఈ కార్యక్రమం హైబ్రిడ్ విధానంలో జరుగుతోంది. ప్రారంభోపన్యాసం చేసిన అఖిల భారతీయ సంయుక్త నిర్వాహక కార్యదర్శి శ్రీ జి. లక్ష్మణ్ జీ, భారతీయ సంప్రదాయం ధర్మ, అర్ధ, కామ, మోక్షాలతో పాటు "లోకాః సమస్తాః సుఖినో భవంతు" అనే విశ్వశాంతి సూత్రంపై ఆధారపడి ఉందని ఉద్ఘాటించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఐఐటీ బొంబాయి ప్రొఫెసర్ కె. రామసుబ్రహ్మణియన్ మాట్లాడుతూ... భూమి ఒక జీవంతో కూడినదని, దానిని ప్రేమిస్తే ప్రకృతి మనల్ని కాపాడుతుందని తెలిపారు. భారతీయ జ్ఞాన వ్యవస్థలు నేటి సమస్యల పరిష్కారానికి ఎలా తోడ్పడతాయో ఆయన వివరించారు. సిబిఐటి ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సి. వి. నరసింహులు మాట్లాడుతూ, కొత్తగా ప్రారంభించిన ఈ కేంద్రం వివిధ విభాగాల పరిశోధనలకు వేదికగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం గౌరవ అతిథులు సావనీర్‌ను విడుదల చేశారు. ఉదయం సెషన్ ముగింపులో డా. ఎస్. తులసి రామ్, సిబిఐటి, ఎస్ఎమ్ఎస్, కృతజ్ఞతలు తెలిపారు. సిబిఐటి యొక్క సమకాలీన విద్యా పరిశోధనలో భారతీయ జ్ఞాన వ్యవస్థలను అభివృద్ధి చేయాలని ఆయన ఆకాంక్షించారు. మధ్యాహ్న సెషన్‌లో డా. డి. భరత్ కుమార్ భారతీయ తత్వశాస్త్రం గురించి వివరిస్తూ, పతంజలి యోగ సూత్రాల్లోని అభ్యాసం, వైరాగ్యం మోక్షానికి ముఖ్యమైన మార్గాలని తెలిపారు. రుగ్వేదంలో ప్రత్యక్షంగా నీటి నిర్మాణాలు గురించి చెప్పకపోయినా, జల దేవతను స్తుతించడం ద్వారా పర్యావరణ సమతుల్యతకు ప్రాధాన్యత ఇవ్వబడిందని, అదే భారతీయ జల సంరక్షణ వ్యవస్థలకు మూలమని ఆయన అన్నారు.