
మాజీ మంత్రి కేటీఆర్ ను కలిసిన దూసరి శ్రీనివాస్ గౌడ్ అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ వ్యవహార శైలిపై ఫిర్యాదు అంబర్ పేట, ఏప్రిల్ 17( దక్షిణాది న్యూస్ ): బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ను గురువారం ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు దూసరి శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ భవన్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ వ్యవహార శైలిపై కేటీఆర్ కు దూసరి ఫిర్యాదు చేశారు. ఇటీవల జరిగిన గోల్నాక డివిజన్ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను దూసరి కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. సెట్టింగ్ కార్పొరేటర్ ను పక్కనబెట్టి తన భార్య కాలేరు పద్మ ఈసారి జిహెచ్ఎంసి ఎన్నికల్లో గోల్నాక డివిజన్ నుంచి పోటీ చేస్తుందని ఎమ్మెల్యే కార్యకర్తలకు చెప్పినట్లు దూసరి కేటీఆర్ కు వివరించారు. దీనిపై స్పందించిన మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ టికెట్ అనేది అధిష్టాన వర్గం నిర్ణయిస్తుందని, దీనిపై ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడడం సరైనది కాదని కేటీఆర్ అన్నట్లు దూసరి మీడియాకు తెలిపారు. నీ పని నువ్వు చేసుకో, డివిజన్ లో పార్టీ బలోపేతానికి కృషి చెయ్ నీకు నేనున్నానని కేటీఆర్ తనకు భరోసా ఇచ్చినట్లు దూసరి తెలిపారు. , పార్టీ టికెట్ విషయంలో ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని, ప్రజల గురించి డివిజన్ అభివృద్ధి గురించి పోరాడాలని సూచించినట్లు చెప్పారు. ఎవ్వరో స్టేట్మెంట్ ఇస్తే వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని కేటీఆర్ తనకు చెప్పినట్లు ఆయన వివరించారు.