
విజయవాడ, ఏప్రిల్ 16: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందని టీడీపీ అధికార ప్రతినిధి పాతర్ల రమేష్ అన్నారు. పర్యావరణ పరిరక్షణకు టీడీపీ కట్టుబడి ఉందని, రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలను చేపడుతుందని ఆయన తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, అభివృద్ధి కోసం కృషి చేస్తున్న 'ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ కౌన్సిల్' ఆధ్వర్యంలో నూతన పత్రిక సంచికను బుధవారం మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ కౌన్సిల్ బాధ్యులు ఎస్.సి.హెచ్. రంగయ్య, గిద్దా శ్రీనివాస నాయుడు, శ్రీదేవి తదితరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా రంగయ్య మాట్లాడుతూ, "పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ పత్రిక దోహదపడుతుంది. పర్యావరణ సమస్యలపై నిరంతరం పోరాడుతూ, పరిష్కార మార్గాలను సూచిస్తాం" అని అన్నారు. గిద్దా శ్రీనివాస నాయుడు మాట్లాడుతూ... "ప్రస్తుత తరుణంలో పర్యావరణ పరిరక్షణ చాలా అవసరం. కాలుష్యం, అడవుల నరికివేత వంటి సమస్యలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది" అని పేర్కొన్నారు. శ్రీదేవి మాట్లాడుతూ, "పర్యావరణ పరిరక్షణలో మహిళల పాత్ర ఎంతో కీలకం. మహిళలు ఇంటి నుంచే పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి" అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పలువురు పర్యావరణ కార్యకర్తలు పాల్గొన్నారు.